Devineni Uma: ఈ ‘మహాదోపిడీ’పై ప్రజలకు సమాధానం చెప్పాలి: దేవినేని ఉమ
- చంద్రబాబు 71 శాతం పనులు పూర్తిచేశారు
- జరుగుతున్న పనులను ఆపారు
- రివర్స్ టెండరింగ్ అన్నారు..
- ఇప్పుడు మొత్తం రూ.3,222 కోట్ల అంచనా పెంచారంటూ విమర్శలు
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనుల అంచనాలను పెంచేశారని ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు.. ఏపీ ప్రభుత్వంపై విమర్శల జల్లు కురిపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిని నిర్మూలించేందుకు తాము రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో జగన్ ప్రకటించారని అందులో గుర్తు చేశారు.
అనంతరం టెండరింగ్, పనుల అప్పగింతలో అవకతవకల పరిశీలనకు ఓ నిపుణుల కమిటీని కూడా వేశారని, దాని సిఫారసుతో కాంట్రాక్టు సంస్థకిచ్చిన పనులను రద్దుచేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టులో మిగిలిన పనులతో పాటు పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు పనులకు పిలిచిన టెండర్లలో రూ.780 కోట్లు ఆదా అయ్యాయని ఏపీ ప్రభుత్వం చెప్పిందని, కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయిని ఆ కథనంలో పేర్కొన్నారు. ఆయా అంశాలను దేవినేని ఉమ ప్రస్తావించారు.
'ఎన్నికల ముందు పోలవరం పునాదులు లేవలేదన్నారు. చంద్రబాబు నాయుడు 71 శాతం పనులు పూర్తిచేస్తే, జరుగుతున్న పనులను ఆపారు. రివర్స్ టెండరింగ్ అన్నారు.. ఆదా అన్నారు. మొత్తం రూ.3,222 కోట్లు అంచనా పెంచారు. ఇసుకకు రూ.500 కోట్లు అదనం. నిన్న ఒక్కరోజే రూ.2,569 కోట్లు పెంచారు. ఈ ‘మహాదోపిడీ’పై ప్రజలకు సమాధానం చెప్పాలి' అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.