Manmohan Singh: నిలకడగానే మన్మోహన్ ఆరోగ్యం: కేంద్ర ఆరోగ్య మంత్రి
- మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రకటన
- వైద్యులతో చర్చిస్తున్నానన్న హర్షవర్ధన్
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. జ్వరంతో నిన్న మన్మోహన్ సింగ్ ఎయిమ్స్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై హర్షవర్ధన్ ఇవ్వాళ ప్రకటన చేశారు.
ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఆయనకు ఇస్తున్న చికిత్సపై ఎప్పటికప్పుడు ఎయిమ్స్ వైద్యులతో చర్చిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాగా, మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో మన్మోహన్ ఎయిమ్స్ లో చేరారు. ముందు జాగ్రత్తగా కరోనా టెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన రెండు డోసుల కొవాగ్జిన్ టీకా తీసుకున్నారు. అయితే, జ్వరం వచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగానే ఆయన ఆసుపత్రిలో చేరారని అధికార వర్గాలు ప్రకటించాయి.
కాగా, కరోనా మహమ్మారి కట్టడిపై ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. మహమ్మారి నియంత్రణపై పలు సలహాలు ఇచ్చారు. ప్రాధాన్య క్రమంలో టీకాలు వేసే విషయంలో ఫ్రంట్ లైన్ వర్కర్ల నిర్వచనాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. మరిన్ని వ్యాక్సిన్లకు ఆర్డర్ పెట్టాలని సూచించారు. టీకాలకు కొరత రాకుండా చూడాలన్నారు.