Etela Rajender: సరిహద్దు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కేసులు భారీగా పెరుగుతున్నాయి: ఈటల
- ప్రజలు భయభ్రాంతులకు గురికాకూడదు
- ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉంది
- కేవలం 5 శాతం మందే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు
కరోనా మరోసారి విజృంభించిన నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురికాకూడదని, తమ శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. సూర్యాపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కరోనా రెండో దశ వ్యాప్తిలో సరిహద్దు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కేసులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు.
కరోనా రోగులు 95 శాతం మంది ఆక్సిజన్, వెంటిలేటర్ల అవసరం లేకుండానే చికిత్స పొందుతున్నారని తెలిపారు. కరోనా రోగుల్లో కేవలం 5 శాతం మందే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అలాగే, ఏడాది కాలంగా 99.5 శాతం కరోనా రోగులు కోలుకున్నారని తెలిపారు. తెలంగాణలో వందలాది కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.