COVID19: 44 లక్షల కరోనా టీకా డోసులు చెత్త కుప్పల పాలు!
- ఓ వైపు కొరత.. మరో వైపు భారీగా వృథా
- తమిళనాడులో అత్యధికంగా 12.1% వృథా
- 7.55 శాతం వృథాతో తెలంగాణకు ఐదో స్థానం
ఓవైపు కరోనా వ్యాక్సిన్ల కొరతతో దాదాపు అన్ని రాష్ట్రాలు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు చాలా రాష్ట్రాల్లో టీకాలు భారీగా వృథాగా పోతున్నాయి. ఈ నెల 11 నాటికి 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ప్రజలకు వేస్తే.. 44 లక్షలకు పైగా డోసులు చెత్త కుప్పల పాలయ్యాయంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. వ్యాక్సిన్ల వేస్టేజీపై సమాచార హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి దరఖాస్తు చేయగా.. కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది.
వ్యాక్సిన్ వృథాలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 12.10 శాతం డోసులు వృథాగా పోయాయి. ఆ తర్వాత 9.74 శాతం వృథాతో హర్యానా రెండో స్థానంలో ఉంది. పంజాబ్ లో 8.12 శాతం, మణిపూర్ లో 7.8 %, తెలంగాణలో 7.55 శాతం మేర వ్యాక్సిన్లు వృథా అయ్యాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, గోవా, డామన్ అండ్ డయ్యూ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లలో వృథా చాలా తక్కువగా ఉందని తేలింది. ఆయా రాష్ట్రాల్లో ‘జీరో వేస్టేజ్’ ఉన్నట్టు పేర్కొంది.