CM KCR: కరోనా హాట్​ స్పాట్​ గా సీఎం కేసీఆర్​ హాలియా సభ!

CM KCR Election Rally Stands As Covid Hot Spot

  • ఆ సభతోనే సీఎంకు కరోనా పాజిటివ్
  • సాగర్ అభ్యర్థి, ఆయన కుటుంబానికీ సభ నుంచే కరోనా
  • మరికొందరు టీఆర్ఎస్ అభ్యర్థులకూ సోకిన మహమ్మారి
  • నిన్న ఒక్కరోజే సాగర్ నియోజకవర్గంలో 160 కేసులు

ఇటు సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. నాగార్జున సాగర్ అభ్యర్థి నోముల భగత్ కూ పాజిటివ్.. మరికొందరు నియోజకవర్గ నేతలకూ సోకిన కరోనా..! దీనికి కారణం.. ఈనెల 14న హాలియాలో నిర్వహించిన సభే అన్నది అందరి నోటా వినిపిస్తున్న మాట. ఈ సభ కరోనాకు హాట్ స్పాట్ గా మారిందని నిఘా వర్గాలు సైతం గుర్తించాయి.

అంతేకాదు.. ఆ సభకు హాజరైన వారిలో చాలా మందికి మహమ్మారి సోకినట్టు అధికారులు గుర్తించారు. సోమవారం ఒక్కరోజే సాగర్ నియోజకవర్గ పరిధిలో 160 మందికి కరోనా సోకింది. 17న జరిగిన సాగర్ ఉప ఎన్నికల ప్రచారం కోసం.. 14న సీఎం కేసీఆర్ హాలియాలో భారీ సభ నిర్వహించారు. సభ కోసం టీఆర్ఎస్ నేతలు దాదాపు లక్ష మందిని సమీకరించారు. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా భారీ సభను నిర్వహించారు.


ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్, నోముల భగత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్య యాదవ్ లకూ పాజటివ్ అని నిర్ధారణ అయింది. ఇప్పుడు సభకు వచ్చిన వారిలో ఇంకా ఎందరికి కరోనా వచ్చి ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క టీఆర్ఎస్ నేతలకే కాదు.. సాగర్ ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్, బీజేపీకి చెందిన కొందరు నాయకులకూ పాజిటివ్ వచ్చింది.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు గన్ మెన్ లకు పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఎన్నికల సభలు, ప్రచారం కోసం ప్రజలు ఎక్కడికక్కడ గుమికూడడం, ప్రజలను కలవడం, ఎక్కడా కరోనా నిబంధనలను పట్టించుకోకపోవడం వంటి కారణాలతోనే సాగర్ నియోజకవర్గంలో ఇప్పుడు కరోనా కల్లోలానికి కారణమని అంటున్నారు.

  • Loading...

More Telugu News