Andhra Pradesh: ఏపీలో కరోనా భయానకం... ఒక్కరోజులో 35 మంది మృత్యువాత
- గత 24 గంటల్లో 37,922 కరోనా పరీక్షలు
- 8,987 మందికి పాజిటివ్
- 4 జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు
- నెల్లూరు జిల్లాలో 8 మంది మృతి
- 50 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
ఏపీలో కరోనా రక్కసి కోరలు చాచి విజృంభిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో 35 మందిని బలి తీసుకుంది. అదే సమయంలో 8 వేలకు పైన కొత్త కేసులు నమోదు కావడం ఏపీలో కరోనా బీభత్సానికి అద్దం పడుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 37,922 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,987 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరుతో పాటు నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి.
అదే విధంగా మరణాల్లోనూ మరింత పెరుగుదల నమోదైంది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో ఎనిమిది మంది మరణించగా, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో ఐదుగురు కరోనాతో కన్నుమూశారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు సంభవించాయి. అదే సమయంలో 3,116 మంది కొవిడ్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 9,76,987 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,15,626 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 53,889 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్ ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 7,472కి పెరిగింది.
.