G Jagadish Reddy: లక్షణాలు లేకుండానే కరోనా వచ్చి మరణిస్తున్నారన్న ప్రచారాన్ని నమ్మవద్దు: మంత్రి జగదీశ్ రెడ్డి
- తెలంగాణలో కరోనా విజృంభణ
- తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న పుకార్లు
- కొట్టిపారేసిన మంత్రి జగదీశ్ రెడ్డి
- ప్రజలు భయపడాల్సిన పనిలేదని స్పష్టీకరణ
- మాస్కు, శానిటైజేషన్ తప్పనిసరి అని సూచన
ఓవైపు కరోనా విషసర్పంలా పడగ విప్పి బుసలు కొడుతుంటే, మరోవైపు పుకార్లు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనిపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వచ్చి ప్రజలు మరణిస్తున్నారని ప్రచారం జరుగుతోందని, దీన్ని నమ్మవద్దని స్పష్టం చేశారు.
ప్రజలు భయపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. స్వీయ నియంత్రణతో కరోనాను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. సెకండ్ వేవ్ లోనూ మాస్కు, శానిటైజేషన్ తో కరోనాను కట్టడి చేయాలని సూచించారు. నల్గొండ జిల్లాలో పడకల కొరత లేదని, ప్రభుత్వాసుపత్రుల్లో తగినన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు జగదీశ్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.