Devendra Fadnavis: వ్యాక్సినేషన్ నిబంధనల్ని ఉల్లంఘించిన సొంత బంధువుపై దేవేంద్ర ఫడ్నవీస్ ఫైర్!
- 45 ఏళ్లు నిండక ముందే టీకా తీసుకున్న వ్యక్తి
- అర్హత లేనివారు తీసుకోవడం సమంజసం కాదన్న ఫడ్నవీస్
- అతనిపై చర్యలు తీసుకోవాలన్న ఫడ్నవీస్ సతీమణి
- అందుకు తమ సహకారం ఉంటుందని స్పష్టం
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బంధువొకరు టీకా నిబంధనల్ని ఉల్లంఘించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం 45 ఏళ్ల పైబడిన వారే టీకా తీసుకోవడానికి అర్హులు. కానీ, ఫడ్నవీస్ కుటుంబానికి చెందిన ఓ చిన్న వయసు వ్యక్తి తన్మయ్ ఫడ్నవీస్ నిబంధనలకు విరుద్ధంగా నాగ్‌పూర్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో టీకా వేయించుకున్నారు. ప్రస్తుతం ఇది ఆ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపింది.
కొవిడ్ చికిత్సలో బంధుప్రీతి, పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ ఇటీవలే శివసేన నేతృత్వంలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంపై ఫడ్నవీస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సరిగ్గా ఇదే తరుణంలో ఈ విషయం వెలుగులోకి రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై ఫడ్నవీస్ సహా ఆయన సతీమణి అమృతా ఫడ్నవీస్ కూడా స్పందించారు. ఒకవేళ టీకా తీసుకున్న వ్యక్తికి అర్హత లేకపోతే అది ఏమాత్రం సరైన చర్య కాదని ఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ తన భార్య, కూతురు సైతం టీకా తీసుకోలేదని తెలిపారు. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ స్పందిస్తూ... విధానాలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రభుత్వ సేవలు అందాలని అభిప్రాయపడ్డారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని వ్యాఖ్యానించారు. చట్టం ప్రకారం ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవచ్చన్నారు. భవిష్యత్తుల్లో ఇలాంటి ఘటనలు ఎదురుకాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు తమ సహకారం ఉంటుందన్నారు.