Priyanka Chopra: అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దు.. ప్లీజ్: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా
- మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
- అందరూ విధిగా మాస్కు ధరించాలి
- మీ కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం జాగ్రత్తలు పాటించండి
- అవసరాన్ని బట్టి ఇరుగు, పొరుగుకు సాయం చేయండి
మహారాష్ట్రలో కరోనా వైరస్ రెండో దఫా విజృంభిస్తున్న వేళ బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలని కోరారు. కరోనా తగ్గిపోయిందన్న భ్రమలో గత రెండు నెలలుగా ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే వైరస్ మళ్లీ విజృంభిస్తోందని విచారం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా విలవిల్లాడుతున్న రాష్ట్రాల పరిస్థితి చూస్తుంటే భయంగా ఉందని, పరిస్థితి అదుపుతప్పినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితుల్లో అందరూ ఇళ్లలోనే ఉండాలని అభ్యర్థిస్తున్నట్టు ప్రియాంక చెప్పుకొచ్చారు. మీ కోసం, మీ కుటుంబం కోసం, మన బంధువులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం దీనిని పాటించాలని సూచించారు. బయటకు వెళ్లిన ప్రతిసారీ మాస్కులు ధరించాలని, అవసరాన్ని బట్టి చుట్టుపక్కల వారికి సాయం చేయాలని ప్రియాంక పేర్కొన్నారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరిన ప్రియాంక.. మనం తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలు వైద్య రంగంపై ఒత్తిడి తగ్గిస్తాయన్నారు.