Imran Khan: బాలీవుడ్ సినిమాలోని సన్నివేశాన్ని పోస్టు చేసిన పాక్ ప్రధాని.. రచ్చరచ్చ కావడంతో తొలగింపు
- తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతోందన్న ఇమ్రాన్
- ‘ఇంక్విలాబ్’ సినిమాలోని వీడియో క్లిప్ పోస్టు చేసిన ప్రధాని
- విరుచుకుపడిన నెటిజన్లు
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్‌గా మారి రచ్చకు దారితీసింది. తన ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని చెబుతూ 1984 నాటి బాలీవుడ్ సినిమా ‘ఇంక్విలాబ్’లోని ఓ వీడియో క్లిప్‌ను పోస్టు చేశారు.
అందులో అవినీతి రాజకీయ నాయకుడిగా కనిపించిన కాదర్ ఖాన్ తన పార్టీ సభ్యులతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఉన్న దారుల గురించి చెబుతుంటాడు. దేశంలో అల్లర్లు సృష్టించడం ద్వారా ప్రభుత్వాన్ని ఎలా అస్థిరపరచవచ్చో వివరిస్తుంటాడు.
ఈ వీడియోను పోస్టు చేసిన ఇమ్రాన్ తన రాజకీయ ప్రత్యర్థులను కాదర్ ఖాన్‌తో పోల్చారు. దేశంలో సరిగ్గా ఇప్పుడు ఇదే జరుగుతోందని, అవినీతి మాఫియా పీటీఐ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తోందని రాసుకొచ్చారు. ఇమ్రాన్ పోస్టు చేసిన ఈ వీడియోను స్క్రీన్ రికార్డింగ్ చేసిన జర్నలిస్ట్ నైలా ఇనాయత్.. ‘ప్రధాని ఇమ్రాన్‌ను రక్షించేందుకు వచ్చిన ‘గుడ్ బాలీవుడ్’’ అని క్యాప్షన్ తగిలించి షేర్ చేశారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు. ఒకప్పుడు బాలీవుడ్‌ను దిగజారిన సినీ పరిశ్రమగా పేర్కొన్న ఇమ్రాన్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలోని క్లిప్‌ను తన రాజకీయ లెక్చర్ల కోసం వాడుకోవడం ఏంటంటూ దుమ్మెత్తి పోశారు. మరికొందరు ఇమ్రాన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో ఇమ్రాన్ ఆ పోస్టును డిలీట్ చేశారు.