Pigeon: పాక్ సరిహద్దు వద్ద అనుమానాస్పదస్థితిలో కనిపించిన పావురం.. కేసు నమోదు
- పాక్ సరిహద్దుకు 500 మీటర్ల దూరంలో ఘటన
- పావురం కాళ్లకు కట్టిన పేపర్‌లో నంబరు
- ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద అనుమానాస్పదంగా కనిపించిన పావురాన్ని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. బీపీవో రోరన్‌వాలా వద్ద విధుల్లో వున్న ఓ కానిస్టేబుల్ కు సమీపంలో ఈ పావురం ఎగురుతుండగా దాని కాళ్లకు ఓ కాగితం కట్టి ఉండడాన్ని గుర్తించి పట్టుకున్నారు. ఈ నెల 17న ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న ఈ పావురం విధుల్లో ఉన్న కానిస్టేబుల్ నీరజ్ కుమార్ భుజాలపై వాలిందని పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతం పాకిస్థాన్ సరిహద్దుకు 500 మీటర్ల దూరంలో ఉన్నట్టు తెలిపారు.
పావురాన్ని పట్టుకున్న కానిస్టేబుల్ విషయాన్ని పోస్ట్ కమాండర్ ఓంపాల్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దాని కాళ్లకు అంటించిన పేపర్‌పై ఓ నంబరు రాసి ఉంది. అమృత్‌సర్‌లోని కహాగఢ్ పోలీస్ స్టేషన్‌లో పావురంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, 2020 మేలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న పావురాన్ని జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పట్టుకున్నారు.