ONGC: అసోంలో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగుల కిడ్నాప్.. మిలిటెంట్ల పనేనని అనుమానం
- లక్వా క్షేత్రం నుంచి అపహరణ
- సంస్థ వాహనంలోనే కిడ్నాప్
- కిడ్నపర్ల నుంచి రాని డిమాండ్లు
అసోం-నాగాలాండ్ సరిహద్దులోని శివసాగర్ చమురు క్షేత్రంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు అపహరణకు గురైనట్టు ఓఎన్జీసీ ప్రకటించింది. లక్వా క్షేత్రం నుంచి గుర్తు తెలియని సాయుధులు వీరిని కిడ్నాప్ చేశారని పేర్కొన్న సంస్థ.. యూఎల్ఎఫ్ఏ (ఐ) మిలిటెంట్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. అపహరణకు గురైన వారిలో జూనియర్ టెక్నీషియన్లు అయిన గొగొయి, రితుల్ సైకియా, జూనియర్ అసిస్టెంట్ అఖిలేశ్ సైకియా ఉన్నట్టు చెప్పారు.
సంస్థకు చెందిన వాహనంలోనే వీరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దుండగులు అనంతరం ఆ వాహనాన్ని నిమోనాగడ్ అటవీ ప్రాంతంలో వదిలేసి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉద్యోగుల కోసం గాలిస్తున్నారు. కిడ్నాప్ వెనక యూఎల్ఎఫ్ఏ (ఐ) పాత్ర ఉండొచ్చని అనుమానంగా ఉందని, దర్యాప్తు అనంతరం అసలు విషయం బయటపడుతుందని జిల్లా పాలనా విభాగం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కిడ్నాప్‌నకు పాల్పడినవారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి డిమాండ్లు రాలేదన్నారు.