Priyanka Gandhi: మన్మోహన్ సింగ్ ఇచ్చే సలహాలను వినండి: ప్రియాంకాగాంధీ

Take Manmohan Singhs advises says Priyanka Gandhi
  • విపక్ష నేతల మాటలను వినేందుకు కేంద్రం సిద్ధంగా లేదు
  • విదేశాలకు పంపిన వ్యాక్సిన్ల కంటే.. దేశ ప్రజలు అందుకున్న డోసులు తక్కువ
  • పబ్లిసిటీకే మోదీ ప్రాధాన్యతను ఇస్తున్నారు
  • ఎన్నికల ర్యాలీల్లో మోదీ నవ్వులు చిందిస్తున్నారు
కరోనా వల్ల యావత్ దేశం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో కూడా విపక్షాల సలహాలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించడం లేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ మండిపడ్డారు. మాజీ ప్రధాని మన్మాహన్ సింగ్ ఇచ్చిన సలహాలను కూడా మోదీ ప్రభుత్వం పాటించడం లేదని దుయ్యబట్టారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ, మోదీని ఆమె టార్గెట్ చేశారు. పబ్లిసిటీని పక్కనపెట్టి, ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐతో మాట్లాడేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందని... కానీ, విపక్ష నేతల మాటలను వినేందుకు మాత్రం ఇష్టపడటం లేదని వ్యంగ్యంగా అన్నారు.

విపక్షాలకు చెందిన నేతలు కేంద్రానికి మంచి సలహాలను ఇవ్వడం లేదని తాను భావించడం లేదని... ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం వెనుకే అన్ని పార్టీలు ఉన్నాయని చెపుతున్నానని ప్రియాంక చెప్పారు. మన్మోహన్ సింగ్ ఈ దేశానికి పదేళ్లు ప్రధానిగా సేవలందించారని... ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అనే విషయం అందరికీ తెలుసని అన్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే సూచనలను అంతే గౌరవంతో స్వీకరించాలని చెప్పారు. కేంద్రానికి మన్మోహన్ రాసిన లేఖపై ఒక మంత్రి స్పందించడం పట్ల ఆమె మండిపడ్డారు.

ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో విదేశాలకు 6 కోట్ల వ్యాక్సిన్లను పంపించారని... ఇదే సమయంలో మన దేశ ప్రజలు కేవలం మూడు నుంచి నాలుగు కోట్ల డోసులను మాత్రమే అందుకున్నారని ప్రియాంక తెలిపారు. ఈ దేశానికి కేంద్రం తొలి ప్రాధాన్యతను ఇవ్వదా? అని ప్రశ్నించారు. ఈ దేశానికంటే పబ్లిసిటీకే ప్రధాని ఎందుకు ప్రాధాన్యతను ఇస్తున్నారని మండిపడ్డారు. 22 కోట్ల జనాభా ఉండే ఉత్తరప్రదేశ్ కు కేవలం కోటి డోసులను మాత్రమే పంపించారని దుయ్యబట్టారు. ప్రజా హితాన్ని పక్కన పెట్టిన మోదీ... ఎన్నికల ర్యాలీలకే ప్రాధాన్యతను ఇస్తున్నారని విమర్శించారు.

కరోనా నేపథ్యంలో బెడ్లు, ఆక్సిజన్, మందుల కోసం ప్రజలు ఏడుస్తుంటే... ప్రధాని మాత్రం ఎన్నికల ర్యాలీల్లో నవ్వులు చిందిస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. ప్రజలు కష్టాల్లో ఉంటే మీకు నవ్వు ఎలా వస్తోందని ప్రశ్నించారు.
Priyanka Gandhi
Congress
Manmohan Singh
Narendra Modi
BJP

More Telugu News