Nashik Hospital Gas Leak: నాసిక్ ఘటనలో భారీగా పెరిగిన మృతుల సంఖ్య.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి!
- ఆక్సిజన్ అందకపోవడంతో 22 మంది మృతి
- విషాదకర ఘటన మనసును కలచివేసిందన్న మోదీ
- ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఆవేదనకు గురి చేస్తోందని వ్యాఖ్య
మహారాష్ట్ర నాసిక్ లోని జాకీర్ హుస్సేన్ మున్సిపల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ కావడంతో... ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ అందకపోయిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు అరగంట పాటు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో, వెంటిలేటర్లపై ఉన్న పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 22కి చేరింది. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో దాదాపు 150 మంది పేషెంట్లు ఆక్సిజన్ సాయంతో లేదా వెంటిలేటర్లపై ఉంటూ చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 'ఆక్సిజన్ లీకేజ్ వల్ల నాసిక్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న విషాదకర ఘటన మనసును కలచివేస్తోంది. ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఎంతో ఆవేదనకు గురి చేస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని మోదీ ట్వీట్ చేశారు.
దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ, ఆసుపత్రి వద్ద ఆక్సిజన్ లీకైన కారణంగా ఎందరో విలువైన ప్రాణాలు పోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందని చెప్పారు. ఈ విషాదకర ఘటనలో పేషెంట్లు మృతి చెందడం బాధిస్తోందని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.