Manish Sisodia: తమ ఆక్సిజన్ ట్యాంకర్ ను దొంగిలించారన్న హర్యానా ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వ స్పందన!
- ఒక అధికారి కారణంగా ఆక్సిజన్ ట్యాంకర్ నిలిచిపోయింది
- కేంద్రం జోక్యంతో ఆ ట్యాంకర్ అక్కడి నుంచి కదిలింది
- మనలో మనం గొడవ పడటం సరికాదు
ఆక్సిజన్ తీసుకొస్తున్న తమ ట్యాంకర్ ను ఢిల్లీ ప్రభుత్వం దొంగిలించిందంటూ హర్యానా ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలే ఇలా చేస్తే ఎలాగని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా స్పందించారు.
ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి సమస్యలు లేవని ఆయన అన్నారు. ప్రతి రాష్ట్రం వారికి రావాల్సిన ఆక్సిజన్ కోటాను అందుకుంటుందని చెప్పారు. అందరం కలిసి కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని, మనలో మనం గొడవ పడటం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని... సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఢిల్లీ-హర్యానా సరిహద్దులో ఉన్న ఫరీదాబాద్ వద్ద ఒక అధికారి కారణంగా ఆక్సిజన్ ట్యాంకర్ నిలిచిపోయిందని శిసోడియా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కలగజేసుకోవడంతో ఆ ట్యాంకర్ అక్కడి నుంచి బయల్దేరిందని చెప్పారు. ఆక్సిజన్ ట్యాంకర్లు ఎక్కడున్నాయో అని ఆలోచిస్తూ డాక్టర్లు, ఆసుపత్రులు సమయాన్ని వృథా చేయరాదని... పేషెంట్లకు చికిత్స అందించడంపైనే దృష్టి సారించాలని సూచించారు.
మరోవైపు ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో... ఢిల్లీకి ఆక్సిజన్ కోటాను 378 మెట్రిక్ టన్నుల నుంచి 500 మెట్రిక్ టన్నులకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీనిపై శిసోడియా స్పందిస్తూ... కోటాను పెంచడం సంతోషకరమని.. అయితే, ఇప్పటి వరకు 378 మెట్రిక్ టన్నుల కోటా కూడా సరిగా అందడం లేదని అన్నారు.