India: దేశంలో భయపెడుతున్న కరోనా వైరస్ ట్రిపుల్ మ్యూటెంట్.. పశ్చిమ బెంగాల్‌లో వ్యాప్తి
- దేశంలో ఇప్పటికే డబుల్ మ్యూటెంట్
- రోగ నిరోధక శక్తిని విచ్ఛిన్నం చేసి మరీ దూసుకెళ్లే లక్షణం
- ట్రిపుల్ మ్యూటెంట్ బి.1.618 రకంలో అధిక సంక్రమణ సామర్థ్యం
ఇప్పటికే డబుల్ మ్యూటెంట్‌తో భయపెడుతున్న కరోనా వైరస్ ఇంకోసారి ఉత్పరివర్తనం చెంది ట్రిపుల్ మ్యూటెంట్‌గా మరింత బలంగా తయారైంది. ప్రత్యేక జన్యువుతో రోగ నిరోధకశక్తిని దాటుకుని మరీ చొచ్చుకుపోయే కొత్త రకం మ్యూటెంట్ బి.1.618ను పశ్చిమ బెంగాల్‌లో గుర్తించినట్టు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.
ప్రస్తుతం వైరస్‌తో వణుకుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఇండియన్ వేరియంట్‌గా చెబుతున్న డబుల్ మ్యూటెంట్ బి.1.617 రకం ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నట్టు గుర్తించారు. దీనికి కూడా రోగ నిరోధకశక్తిని విచ్ఛిన్నం చేసే శక్తి ఉండడంతో ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వ్యాధికి కారణమయ్యే స్పైక్ ప్రొటీన్ భాగంలో ఈ484 క్యూ, ఎల్ 452 ఆర్‌తో కలిసి ఇది డబుల్ మ్యూటెంట్‌గా మారింది. ఈ484క్యూ మ్యుటేషన్ బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి, కాలిఫోర్నియా నుంచి ఎల్452ఆర్ నుంచి వ్యాప్తి చెందాయి. ఈ రెండింటి కలయికతో దేశీయంగా డబుల్ మ్యూటెంట్ ఏర్పడిందని అంచనా వేస్తున్నారు.
ఇక, తాజాగా బయటపడిన ట్రిపుల్ మ్యూటెంట్ బి.1.618 రకం వైరస్‌లో స్పైక్ ప్రొటీన్ ఈ484కె, డి614జి రకాలను కలిగి ఉంది. దీంతో వైరస్ సంక్రమణ సామర్థ్యం పెరుగుతోందని ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జినోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు.