COVID19: కరోనా పాజిటివ్ రిపోర్టు లేకున్నా గాంధీ ఆసుపత్రిలో చికిత్స.. ఆదేశాలు జారీ

Gandhi Hospital At Secunderabad taken key decision

  • కొవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ లేనందుకు చేర్చుకోని వైద్యులు
  • నరకయాతన అనుభవించి మహిళ మృతి
  • అత్యవసర చికిత్స కోసం వచ్చే వారిని అడ్డుకోవద్దంటూ ఆదేశాలు

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ సోకినట్టు రిపోర్టు లేకున్నా అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు వైద్యం అందించాలని నిర్ణయించినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలోకి తీసుకొచ్చే అంబులెన్స్‌లను అడ్డుకోవద్దని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. ఇటీవల జరిగిన ఓ ఘటన నేపథ్యంలోనే ఆయన నిబంధనలు మార్చారు.

రెండు రోజుల క్రితం ఓ మహిళ, ఆమె కుమారుడు అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి వచ్చారు. కరోనా సోకడంతో తనకు శ్వాస అందడం లేదని, తక్షణం వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అయితే, ఆమె వద్ద కొవిడ్ సోకినట్టు రిపోర్టు లేకపోవడంతో వారిని చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో నిరాశగా వెనుదిరిగిన వారు ఇంటి వద్దే ఏడు రోజులపాటు చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో రెండు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. అక్కడా చేర్చుకోకపోవడంతో మరోమారు ఆసుపత్రికి తీసుకొచ్చారు.

ఈసారి కూడా ఆమెకు చికిత్స అందించేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో అంబులెన్స్‌లోనే రెండు గంటలపాటు నరకయాతన అనుభవించిన ఆమె మృతి చెందింది. నిజానికి ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుకు సంబంధించిన నివేదిక ఇవ్వకపోవడం ఆమె ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో రావడంతో స్పందించిన డాక్టర్ రాజారావు ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు మార్చారు. కొవిడ్ పాజిటివ్ నివేదిక లేనప్పటికీ ఆసుపత్రికి వచ్చే రోగులకు చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News