Telangana: వెంటాడుతున్న లాక్‌డౌన్ భయం.. ఖాళీ అవుతున్న హైదరాబాద్!

Lockdown news Hyderabad becoming vacant
  • వలసజీవిని వేధిస్తున్న లాక్‌డౌన్ భయం
  • రైళ్లలో రోజుకు సగటు 2.60 లక్షల మంది ప్రయాణం
  • కిటకిటలాడుతున్న బస్సులు.. బోసిపోతున్న రోడ్లు
హైదరాబాద్‌లోని వలస జీవులను లాక్‌డౌన్ భయం వేధిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. రాష్ట్రంలో ప్రతి రోజూ వేలాది కేసులు వెలుగుచూస్తున్నాయి. వైరస్ కనుక అదుపులోకి రాకుంటే లాక్‌డౌన్ తప్పదంటూ వార్తలు షికారు చేస్తున్న  నేపథ్యంలో హైదరాబాద్‌లోని వలస కార్మికులు స్వగ్రామాలకు పయనమవుతున్నారు.

అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుని సొంతూళ్ల బాటపడుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే తరలిపోతుండడంతో రాజధానిలోని శివారు ప్రాంతాలు ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి వలస కార్మికులు దాదాపు 18 లక్షల మంది వరకు ఉండగా, వీరిలో దాదాపు 60 శాతం మంది వారం క్రితమే నగరాన్ని విడిచిపెట్టారు. మిగిలిన వారు కూడా వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నారు.

పెద్ద ఎత్తున తరలిపోతున్న వారితో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి  బయలుదేరే రైళ్లు నిండిపోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన, విశాఖపట్టణం వెళ్లే గోదావరి, కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్ రైళ్లు గత వారం రోజులుగా ప్రయాణికులతో కిక్కిరిసి వెళుతున్నాయి.

ఇక ఆయా రైళ్లలో రిజర్వేషన్ నాలుగైదు రోజుల ముందే పూర్తయిపోతోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రోజుకు సగటున 2.60 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు, స్వగ్రామాలకు జనం తరలుతుండడంతో నగరంలోని రోడ్లు చాలా వరకు బోసిపోయి కనిపిస్తున్నాయి.
Telangana
Hyderabad
Migrant workers
Trains
Busses

More Telugu News