Atchannaidu: ప్రైవేట్ టీచర్ల సమస్యలపై.. సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ
- ఏపీలో ఉపాధ్యాయలు కార్మికులుగా మారారు
- కరోనా దెబ్బకు వారి బతుకులు దుర్భరం అయ్యాయి
- వారికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలి
ప్రైవేట్ టీచర్ల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ రాశారు. కరోనా దెబ్బకు వారి బతుకులు దుర్భరంగా మారాయని, ప్రైవేటు టీచర్ల పట్ల నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. భావి భారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దటంలో టీచర్ల పాత్ర కీలకమని, అటువంటి ఉపాధ్యాయులు ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు.
కరోనా దెబ్బకు టీచర్లు కార్మికులుగా మారారని, వారి సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అన్నారు. ఉపాధి కోల్పోయిన బోధన, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటు ఉపాధ్యాయులు కరోనా వల్ల ఆకలితో అలమటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ టీచర్లను పలు రాష్ట్రాలు ఆదుకుంటున్నాయని ఏపీలో మాత్రం సర్కారు ఆదుకోవట్లేదని విమర్శించారు.