Kishan Reddy: వ్యాక్సిన్ ధరలపై ప్రధాని మోదీని ప్రశ్నించిన కేటీఆర్‌కు కిషన్ రెడ్డి సమాధానం!
- ఇప్పటి వరకు రాష్ట్రాలకు 13 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ
- మరికొన్ని కోట్ల డోసుల నిల్వలు ఉన్నాయి
- ఈ డోసుల వ్యాక్సిన్లన్నింటినీ రాష్ట్రాలకు ఉచితంగా ఇచ్చాం
- ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్లు వేస్తామని ప్రకటించాయి
ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్‌కు రెండు ధరలు ఎందుకని, వ్యాక్సిన్ల కొనుగోళ్లలో రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని ప్రధాన మంత్రి కేర్స్ నిధుల నుంచి భరించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. కేటీఆర్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఆయన కౌంటర్ ఇచ్చారు.
'రాష్ట్రాలకు అవసరమైనన్ని వ్యాక్సిన్లను సరఫరా చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ కష్టపడి పనిచేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రాలు 13 కోట్ల వ్యాక్సిన్ డోసులను వేశాయి. మరికొన్ని కోట్ల డోసుల నిల్వలు ఉన్నాయి. ఈ డోసుల వ్యాక్సిన్లన్నింటినీ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది' అని కిషన్ రెడ్డి వివరించారు.
కొన్ని రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తుల మేరకే ఇప్పుడు వ్యాక్సిన్లను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి ప్రజలకు వేయించడానికి, 18 ఏళ్లు నిండిన వారందరికీ అందించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని చెప్పారు. ఇప్పటికే ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు వేస్తామని ప్రకటించాయని గుర్తు చేశారు. అంతేగాక, మే 1 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తూనే ఉంటుందని, తన 50 శాతం కోటాలో రాష్ట్రాలకు ఉచితంగానే వ్యాక్సిన్లు పంపిణీ చేస్తుందని ఆయన చెప్పారు.
మరోవైపు, కొవాగ్జిన్ సమర్థతపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన మరో ట్వీట్ చేశారు. 'హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా, సార్స్‌కోవ్-2తో పాటు ఇతర మ్యూటెంట్లను కూడా అడ్డుకుంటోందని ఐసీఎంఆర్ పరిశోధనలో తేలడం శుభపరిణామం. ఇది కొవిడ్ 19పై పోరాటం చేస్తున్న మన శాస్త్రవేత్తల విజయం. వీరి కృషితో దేశానికి త్వరలోనే కరోనా నుంచి విముక్తి లభిస్తుందని ఆశిస్తున్నాను' అని పేర్కొన్నారు.