Devineni Uma: సీఐడీ విచారణకు హాజరు కావాలని దేవినేని ఉమకు హైకోర్టు ఆదేశం
- వీడియోలను మార్ఫింగ్ చేశారని అభియోగాలు
- దేవినేని ఉమ వేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు
- తదుపరి విచారణ మే 7కు వాయిదా
- దేవినేని ఉమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఇటీవల సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్ఫింగ్ చేసిన ఏపీ సీఎం జగన్ వీడియోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. దీనిపై దేవినేని ఉమ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది.
సీఐడీ ఎఫ్ఐఆర్‌ను సస్పెండ్ చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 29న సీఐడీ విచారణకు హాజరు కావాలని దేవినేని ఉమను ఆదేశించింది. మంగళగిరి సీఐడీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 7కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి వరకు దేవినేని ఉమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. సెక్షన్ 41 కింద ఆయనకు రక్షణ కల్పించాలని తెలిపింది. అలాగే, సీఐడీ దర్యాప్తు అధికారిని మార్చాలని సీఐడీకి హైకోర్టు సూచించింది.