Adimulapu Suresh: పది, ఇంటర్ పరీక్షలపై మరో సమీక్ష తర్వాత నిర్ణయం తీసుకుంటాం: ఏపీ విద్యాశాఖ మంత్రి
- నారా లోకేశ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
- హైదరాబాదులో కూర్చొని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది
- పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది
పది, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే 80 లక్షల మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని... విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కరోనా బారిన పడితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహిస్తారా? అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
లోకేశ్ వ్యాఖ్యలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు. విద్యా సంవత్సరాన్ని కాపాడే ప్రయత్నాన్ని కూడా రాజకీయం చేసే రీతిలో లోకేశ్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. నారా లోకేశ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఎక్కడో హైదరాబాదులో ఉంటున్న లోకేశ్... ఏపీలోని విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
పరీక్షల నిర్వహణపై మరో సమీక్ష తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆదిమూలపు సురేశ్ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.