Rajasthan Royals: కొనసాగుతున్న విజయాల పరంపర.. రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం
- పడిక్కల్ అజేయ సెంచరీ
- వికెట్ నష్టపోకుండానే లక్ష్యాన్ని ఛేదించిన కోహ్లీ సేన
- ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం
ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 178 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 21 బంతులు మిగిలి ఉండగానే వికెట్ నష్టపోకుండా ఛేదించింది.
ఓపెనర్ దేవదత్ పడిక్కల్ అజేయ సెంచరీతో దుమ్ము రేపాడు. 52 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేయగా, కెప్టెన్ కోహ్లీ 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 72 పరుగులు చేసి జట్టుకు వరుసగా నాలుగో విజయాన్ని అందించాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించిన ఆర్‌సీబీ 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. సంజు శాంసన్ 21, శివమ్ దూబే 46, రియాన్ పరాగ్ 25, రాహుల్ తెవాటియా 40 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయారు.
ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, హర్షల్ పటేల్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. జెమీసన్, కేన్ రిచర్డ్‌సన్, సుందర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. సెంచరీతో అదరగొట్టిన పడిక్కల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నేడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.