Andhra Pradesh: 1.02 కోట్లకు మంది మహిళలకు లబ్ధి.. మంచి కార్యక్రమానికి శ్రీకారం: ఏపీ సీఎం జగన్
- వరుసగా రెండో ఏడాది డ్వాక్రా సంఘాల రుణాలపై వడ్డీ మాఫీ
- ఈరోజు రూ.1,109 కోట్లు సంఘాల ఖాతాల్లో జమ
- 9.34 లక్షల స్వయం సహాయక సంఘాలకు లబ్ధి
- మహిళా సాధికారతను లక్ష్యంగా పెట్టుకున్నామన్న జగన్
సమాజంలో అక్కాచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం బాగుంటుందని, కుటుంబం బాగున్నప్పుడే రాష్ట్రమూ బాగుంటుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన వరుసగా రెండో ఏడాది డ్వాక్రా సంఘాల రుణాలకు వడ్డీ మాఫీ చేశారు. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు.
డ్వాక్రా సంఘాల రుణాలకు వడ్డీ మాఫీతో 1.02 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మహిళా సాధికారతను నినాదంలా కాకుండా ఓ లక్ష్యంగా పెట్టుకున్నామని, దానిని ఆచరణలో పెట్టామని, అందుకే ప్రతి అడుగులోనూ అదే కనిపిస్తుందని చెప్పారు. గర్భంలోని శిశువు నుంచి పండు వృద్ధుల దాకా అందరికీ అన్నీ అందేలా సామాజిక, ఆర్థిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అందరికీ విద్య, వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
2020–2021 ఆర్థిక సంవత్సరంలో పొదుపు సంఘాల్లోని అక్కాచెల్లెమ్మలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించారని, దీంతో వారికి వరుసగా రెండో ఏడాదీ సున్నా వడ్డీని వర్తింపజేస్తున్నామని జగన్ తెలిపారు. 1.02 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరేలా 9.34 లక్షల స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.1,109 కోట్లు జమ చేస్తున్నామని ప్రకటించారు.