Telangana: తెలంగాణలో నేడు, రేపు ఉరుములతో కూడిన వర్షాలు
- అకాల వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టం
- రెండు రోజులపాటు ధాన్యాన్ని అమ్మకానికి తీసుకురావొద్దన్న ప్రభుత్వం
- నల్గొండ జిల్లా సింగరాజ్‌పల్లిలో అత్యధికంగా 4.4 సెంటీమీటర్ల వర్షం
తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరఠ్వాడా ప్రాంతంలో ఉపరితల ద్రోణి ఏర్పడడం, అక్కడి నుంచి కర్ణాటక మీదుగా గాలులతో ఆవర్తనం ఏర్పడడమే ఇందుకు కారణమని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం రెండు రోజులపాటు మార్కెట్లకు ఎవరూ ధాన్యాన్ని అమ్మకానికి తీసుకురావద్దని కోరింది.
నిన్న నల్గొండ జిల్లా సింగరాజ్‌పల్లిలో 4.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పడమలిపల్లెలో 3.4, నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండలో 2.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అకాల వర్షాల కారణంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 10 వేల ఎకరాల్లో, మరో 8 జిల్లాల్లో 15 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
మరోవైపు, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్‌లో అత్యధికంగా 41.6, ఆదిలాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.