People Unions Ban: విరసం, పౌర హక్కుల సంఘం సహా... 16 ప్రజా సంఘాలపై తెలంగాణలో నిషేధం!
- చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న సంఘాలు
- చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది
- జీవో నంబర్ 73లో సీఎస్ సోమేశ్ కుమార్
వివిధ రకాల సమస్యలపై గళమెత్తే 16 ప్రజా సంఘాలపై తెలంగాణ సర్కారు ఏడాది పాటు నిషేధం విధించింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని, ఇవన్నీ మావోయిస్టు అనుబంధ సంస్థలేనని ప్రకటిస్తూ, కేసీఆర్ సర్కారు జీవో జారీ చేసింది. నిషేధం విధించబడిన ప్రజా సంఘాల్లో విరసం (విప్లవ రచయితల సంఘం), పౌర హక్కుల సంఘం, తుడుం దెబ్బ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ తదితర సంఘాలున్నాయి.
ఈ సంస్థలన్నీ చట్ట విరుద్ధ వ్యవహారాలకు పాల్పడుతున్నాయని సీఎస్ సోమేశ్ కుమార్ పేరిట జారీ అయిన జీవో నంబర్ 73లో ప్రభుత్వం పేర్కొంది. ఈ సంఘాలు బీమా-కోరెగాం కేసులో భాగంగా ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన వరవరరావు, సాయిబాబా, రోనా విల్సన్ తదితరులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయని, ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంఘాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది.
ఇక నిషేధాన్ని ఎదుర్కోనున్న ఇతర ప్రజా సంఘాల్లో టీపీఎఫ్ (తెలంగాణ ప్రజా ఫ్రంట్), టీఏకేఎస్ (తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య), టీవీవీ (తెలంగాణ విద్యార్థి వేదిక, టీవీఎస్ (తెలంగాణ విద్యార్థి సంఘం), డీఎస్యూ (డెమొక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్), ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్, ప్రజా కళా మండలి, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, ఫోరమ్ అగనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సివ్, చైతన్య మహిళా సంఘం, సివిల్ లిబర్టీస్ కమిటీ, అమరుల బంధు మిత్రుల సంఘం, తెలంగాణ రైతాంగ సమితి తదితరాలున్నాయి.