Nadendla Manohar: జర్నలిస్టులకు బస్ పాసులను కూడా దూరం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే: నాదెండ్ల మనోహర్
- అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ సక్రమంగా లేదు
- వేలాది మంది పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేదు
- హెల్త్ కార్డులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, ఆరోగ్య బీమా కార్డుల జారీ సక్రమంగా జరగడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. నిబంధనల పేరుతో వేల మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. పట్టణ, మండల స్థాయిలో పని చేస్తున్న విలేకర్లకు గుర్తింపు కార్డులు లేకపోవడంతో వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జర్నలిస్టులకు బస్సు పాసులు కూడా దూరం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదని వ్యంగ్యంగా అన్నారు.
కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి జర్నలిస్టులు రిపోర్టింగ్ చేస్తున్నారని... వారి ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించాల్సి ఉందని మనోహర్ సూచించారు. హెల్త్ కార్డులు లేకపోవడంతో కరోనా బారిన పడిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రుల్లో చేరి ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు పాత్రికేయులు, వారి కుటుంబసభ్యులు ఇప్పటికే కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. జర్నలిస్టులను ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి వారికి చేయూతను అందించాలని డిమాండ్ చేశారు.