SBI Research: ఇండియాలో ఆంక్షల కారణంగా రూ. 1.50 లక్షల కోట్ల నష్టం: ఎస్బీఐ రీసెర్చ్

India Losses One and Half Lakh Crore Due to Temporary Lockdowns
  • కరోనా కేసుల సంఖ్య సరికొత్త గరిష్ఠాలకు
  • వృద్ధి రేటు 10.4 శాతానికి కుదింపు
  • సంపూర్ణ లాక్ డౌన్ అవసరం లేదు
  • ఎస్బీఐ సలహాదారు సౌమ్య కాంతి ఘోష్
రోజువారీ కరోనా కేసుల సంఖ్య సరికొత్త గరిష్ఠాలకు చేరిన వేళ, వైరస్ ను నియంత్రించేందుకు పలు రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ సహా పలు రకాల ఆంక్షలను విధిస్తున్న వేళ, దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 1.50 లక్షల కోట్ల వరకు నష్టం ఏర్పడనుందని ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాలను 11 శాతం నుంచి 10.4 శాతానికి కూడా తగ్గిస్తున్నట్టు పేర్కొంది.

ఇండియాలో కేసుల సంఖ్య పరంగా తొలి స్థానంలో ఉన్నప్పటికీ, సంపూర్ణ లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని, ఇదే సమయంలో ప్రజలకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ అందిస్తే సరిపోతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. దేశంలోని జనాభా అందరికీ టీకాలు ఇస్తే, మొత్తం జీడీపీలో 0.1 శాతం మాత్రమే ఖర్చవుతుందని, ఇప్పటికే విధించిన లాక్ డౌన్ కారణంగా జీడీపీపై 0.7 శాతం భారం పడిందని తాజాగా విడుదలైన ఈ రీసెర్చ్ నివేదిక పేర్కొంది.

ఇక పాక్షిక లాక్ డౌన్ ల కారణంగా దాదాపు 80 శాతం నష్టం మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకే కలుగనుందని, దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో బ్రిటన్, ఇజ్రాయెల్, చీలీ తదితర దేశాలతో పోలిస్తే ఇండియా వెనుకబడి వుందని, ఇప్పటికవరకూ కేవలం 1.2 శాతం మందికే టీకాలు అందాయని పేర్కొంది. గత సంవత్సరం బ్యాంకుల రుణ వృద్ధి దాదాపు ఆరు దశాబ్దాల కనిష్ఠ స్థాయిలో 5.56 శాతానికి చేరిందని విశ్లేషించిన బ్యాంకు, ప్రభుత్వ ఉద్దీపనలు ప్రకటించినా, ఫలితం లభించలేదని గుర్తు చేసింది.

1961-62 ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 5.38 శాతం కాగా, ఆపై అంత తక్కువకు పడిపోయింది ఈ సంవత్సరమేనని ఎస్బీఐ రీసెర్చ్ తెలియజేసింది. జీడీపీలో 11 శాతానికి సమానంగా రూ. 20 లక్షల కోట్ల విలువైన ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించినా, కరోనాపై పోరాడేందుకు వెచ్చించింది రూ. 3 లక్షల కోట్లు మాత్రమేనని, మిగతా మొత్తం రుణ మద్దతుకే సరిపోయిందని తెలిపింది.
SBI Research
India
Lockdown
Corona Virus
GDP

More Telugu News