Caitlyn Jenner: కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ పడుతున్న ట్రాన్స్ జెండర్ ఐకాన్!
- ఎన్నికల బరిలో నిలిచిన ట్రాన్స్ జెండర్ జెన్నర్
- ట్రాన్స్ జెండర్ ఎన్నికల బరిలో నిలవడం ఇదే తొలిసారి
- తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న జెన్నర్
అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక రాష్ట్ర గవర్నర్ పదవికోసం ఓ ట్రాన్స్ జెండర్ పోటీ చేయబోతున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ ఎన్నికలకు సంబంధించి పేపర్ వర్క్ ను అందజేశానని ట్రాన్స్ జెండర్, డెకాథ్లాన్ ఒలింపిక్ ఛాంపియన్, కర్దాసియన్ వంశానికి చెందిన కైట్లిన్ జెన్నర్ తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్నానని 71 ఏళ్ల ట్రాన్స్ జెండర్ ఐకాన్ జెన్నర్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.
కాలిఫోర్నియా గవర్నర్ గా హాలీవుడ్ స్టార్ అర్నాల్డ్ ష్క్వార్జనెగ్గర్ బాధ్యతలను నిర్వహించిన తర్వాత.. ఆ పదవికి పోటీపడుతున్న నాన్ పొలిటీషియన్ సెలబ్రిటీ జెన్నర్ కావడం గమనార్హం. కాలిఫోర్నియా గవర్నర్ గా అర్నాల్డ్ ఏడేళ్లకు పైగా సేవలందించారు. ప్రస్తుత గవర్నర్ గవిన్ న్యూసమ్ (డెమొక్రాట్) ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లలోనే ఉండాలంటూ ఆయన ఇచ్చిన ఆదేశాలు ప్రజాగ్రహానికి గురయ్యాయి.
ఈ సందర్భంగా జెన్నర్ మాట్లాడుతూ, గవిన్ అధికారానికి ముగింపు పలికే సత్తా తనకు మాత్రమే ఉందని చెప్పారు. కఠినమైన లాక్ డౌన్ విధించడం వల్ల చిన్న తరహా వ్యాపారాలు ఎన్నో దెబ్బతిన్నాయని ఆమె అన్నారు. చిన్నారులు ఏడాది చదువును కోల్పోయారని చెప్పారు. స్కూళ్లకు వెళ్లడం, స్నేహితులతో ఆటపాటలను వారు కోల్పోయారని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా ఆమె వ్యవహరించారు.