Uttarakhand: ఉత్తరాఖండ్​ లో హిమనీనదం బీభత్సం.. 8 మంది మృతి

8 Killed and 6 Critically injured after Avalanche in Uttarakhand
  • ఆరుగురికి తీవ్రగాయాలు
  • శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
  • 430 మందిని కాపాడినట్టు ప్రకటించిన ఆర్మీ
ఉత్తరాఖండ్ లో మరోసారి మంచు చరియలు విరిగిపడ్డాయి. ఆమధ్య మంచు చరియలు విరిగి.. గంగ ఉప్పొంగి.. విద్యుత్ ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన ఘటనలో 200 మంది దాకా చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొన్ని నెలలకే అదే ప్రాంతంలో తాజాగా మరో ప్రమాదం జరిగింది. ఇండో చైనా సరిహద్దుల్లోని చమోలి జిల్లాలోని సుమనా వద్ద హిమనీ నదాలు ముంచెత్తాయి. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోషిమఠ్ సెక్టార్ లోని సూర్య కమాండ్ ట్వీట్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ రంగంలోకి దిగిందని, హిమనీనదాల్లో చిక్కుకున్న 430 మందిని కాపాడిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం భాప్ కుంద్ నుంచి సమనా మధ్య రాకపోకలకు ఆటంకాలు ఏర్పడ్డాయని, రహదారిని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అందుకు మరో 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉందన్నారు.

బీఆర్వో క్యాంప్ పై హిమనీనదాలు విరుచుకుపడ్డాయని సూర్యకమాండ్ వెల్లడించింది. శుక్రవారం మధ్యాహ్నం భారీగా మంచు కురిసిందని, తొలుత 55 మంది సిబ్బంది అందులో చిక్కుకున్నట్టు భావించామని చెప్పింది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో సాయంత్రం వరకు సహాయ చర్యలు కొనసాగించలేకపోయామని పేర్కొంది. దీంతో రాత్రి పూట కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నామని, మరో 150 మంది సైనికులు అవలాంచ్ లో చిక్కుకున్నట్టు గుర్తించామని వెల్లడించింది. అందరినీ కాపాడామని పేర్కొంది.

ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లు సాగుతున్నాయని చెప్పింది. మంచు కింద మరింత మంది చిక్కుకుని ఉండే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, సహాయ చర్యల కోసం అవసరమైన సాయం చేస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ చెప్పారు.
Uttarakhand
Avalanche
Amit Shah
Army

More Telugu News