New Delhi: ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే ఉరి తీస్తాం: ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
- ఓ ఆసుపత్రి పిటిషన్ విచారణ సందర్భంగా ఆగ్రహం
- అడ్డుకున్నది ఎవరైనా వదిలిపెట్టబోమని హెచ్చరిక
- కేంద్రానికీ ఫిర్యాదు చేయాలని ఢిల్లీ సర్కారుకు సూచన
- ఇది కరోనా ‘వేవ్’ కాదు.. సునామీ అన్న కోర్టు
ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునే వారిని ఉరి తీస్తామంటూ ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ కొరతపై ఢిల్లీలోని ఓ ఆసుపత్రి వేసిన పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తమకు 480 టన్నుల ఆక్సిజన్ ఇవ్వకపోతే పరిస్థితి మొత్తం చేజారిపోతుందని ఢిల్లీ ప్రభుత్వమూ కోర్టుకు వివరించింది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాలకు చెందిన కొందరు అధికారులు తరలిస్తున్న ఆక్సిజన్ అడ్డుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ‘‘ఎవరు అడ్డుకుంటున్నారో ఒక్క ఉదాహరణ చెప్పండి. ఎవ్వరైనా మేం వదిలిపెట్టం. ఆ అడ్డుకున్న వ్యక్తిని ఉరి తీస్తాం’’ అంటూ మండిపడింది. అలాంటి అధికారులపై కేంద్ర ప్రభుత్వానికీ ఫిర్యాదు చేయాలని ఢిల్లీ సర్కారును ఆదేశించింది. దాని వల్ల కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది.
దీనిని సెకండ్ వేవ్ అని పిలుస్తున్నామని, కానీ, ఇది పెద్ద సునామీ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో కరోనా కేసులు ఇంకా పీక్ స్టేజ్ లోకి వెళ్లలేదని, మరి ఆ దశకు వస్తే కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించింది.