Chiranjeevi: నా జీవితంపై ఆయన ప్రభావం ఎంతో ఉంది: 'కన్నడ కంఠీరవ' గురించి చిరంజీవి
- ఈ రోజున ప్రముఖ నటుడు రాజ్ కుమార్ 92వ జయంతి
- 'కన్నడ కంఠీరవ'గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం
- అనుబంధాన్ని గుర్తుచేసుకున్న చిరంజీవి
చిరంజీవి తనని తాను మలచుకున్న శిల్పం. కెరియర్ పరంగా ఆయన ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ వచ్చారు. తనకంటే ముందు వరుసలోని సీనియర్ హీరోలపట్ల ఆయన ఎంతో గౌరవ మర్యాదలను చూపేవారు. అందువలన తెలుగులోనే కాదు .. ఇతర భాషల్లోని నటులతోను ఆయనకి ఎంతో సాన్నిహిత్యం ఉంది. టాలీవుడ్ కి కొత్త ఒరవడిని పరిచయం చేసిన హీరోగా చిరంజీవి అంటే వాళ్లందరికీ ఎంతో అభిమానమూ ఉంది. అలా చిరంజీవిని అభిమానించే సీనియర్ స్టార్ హీరోల్లో కన్నడ రాజ్ కుమార్ ఒకరు.
ఈ రోజున కన్నడ కంఠీరవ 92వ జయంతి. ఈ సందర్భంగా చిరంజీవి .. రాజ్ కుమార్ ను స్మరించుకున్నారు. ఆయనతో తనకి గల సాన్నిహిత్యాన్ని .. అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, గతంలో తాము కలుసుకున్నప్పటి ఫొటో ఒకటి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
" మీ గొప్పతనమంతా మీ నిరాడంబరతలోనే ఉంది. అన్నగారూ .. మీ మాటల వలన .. మీరు అనుసరించిన మార్గాల వలన నేను ఎన్నో గొప్ప పాఠాలను నేర్చుకున్నాను. నా జీవితంపై ఆయన ప్రభావం ఎంతో ఉంది. ఆయన నిజమైన బంగారు మనిషి .. అలాంటి మహానుభావుడిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నాను" అంటూ రాసుకొచ్చారు.