Nawajudding: ఆ ఫొటోలను షేర్ చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలి: సెలబ్రిటీలపై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ ఫైర్
- దేశం కరోనాతో అల్లాడుతుంటే.. మీకు మాత్రం మాల్దీవుల్లో తమాషా కావాలి
- ఇక్కడ ఎంతో మందికి తినడానికి తిండి కూడా లేదు
- సెలబ్రిటీలు ఎదగాల్సిన అవసరం ఉంది
బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రేమపక్షులు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న ప్రస్తుత తరుణంలో దేశ వ్యాప్తంగా ఎన్నో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి రోజు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్నేమీ పట్టించుకోకుండా మాల్దీవుల బీచుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై చాలా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతోందని, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతోందని... ఇలాంటప్పుడు వెకేషన్ ఫొటోలను సెలబ్రిటీలు పోస్ట్ చేస్తుండటం దారుణమని నవాజుద్దీన్ అన్నారు. జనాలకు తినడానికి కూడా తిండిలేదని... మీరు మాత్రం డబ్బులను ఖర్చు చేస్తూ, జల్సాలు చేస్తున్నారని... కొంచెమైనా సిగ్గుండాలని మండిపడ్డారు. నటన గురించి తప్ప వాళ్లు ఏమీ మాట్లాడలేరని అన్నారు. వీళ్లందరికీ మాల్దీవుల్లో తమాషా కావాలని విమర్శించారు. కనీసం మానవతా దృక్పథంతోనైనా కొన్నాళ్లు వెకేషన్లను మానుకోవాలని సూచించారు.
కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని... కొంచెం మంచి మనసులు కలిగి ప్రవర్తించాలని అన్నారు. మనమంతా దేశ ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నామని... ఇదే సమయంలో మనం ఇతర విషయాల్లో ఎదగాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. తన వెకేషన్ గురించి మాట్లాడుతూ, తాను బుధానాలోని తన ఇంట్లో కుటుంబంతో కలిసి ఉంటున్నానని... ఇదే తనకు మాల్దీవులని చెప్పారు.