Kolkata Knight Riders: కోల్ కతాను హడలెత్తించిన మోరిస్... రాజస్థాన్ సునాయాస విజయం!
- శనివారం ముంబై వేదికగా కేకేఆర్, ఆర్ఆర్ మధ్య మ్యాచ్
- 133 పరుగులకే పరిమితమైన కోల్ కతా
- సంజూ, మిల్లర్ రాణించడంతో ఆర్ఆర్ విజయం
నిన్న రాత్రి ముంబై వేదికగా, కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన టీ-20 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ సునాయాస విజయం సాధించింది. తొలుత బౌలింగ్ లో క్రిస్ మోరిస్ కోల్ కతా ఆటగాళ్లను హడలెత్తించగా, ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆపై కెప్టెన్ సంజూ సామ్సన్, డేవిడ్ మిల్లర్ లు రాణించడంతో 6 వికెట్ల తేడాతో విజయం లభించింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడిన శుభమన్ గిల్ 11 పరుగులు చేసి రన్నౌట్ కాగా, ఆపై వచ్చిన రాహుల్ త్రిపాఠీ, మరో ఎండ్ లో ఉన్న నితీశ్ రాణాతో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అయితే, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఉండటంతో కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.
లక్ష్యం తక్కువగా ఉండటంతో, రాజస్థాన్ రాయల్స్ నిదానంగా తన ఆటను ప్రారంభించింది. క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నంలో బట్లర్ అవుట్ కాగా, ఆపై వన్ డౌన్ లో వచ్చిన సంజూ, యశస్వి జైస్వాల్ తో కలిసి స్కోరును ముందుకు దూకించాడు. 10 ఓవర్లు ముగిసేవరకు 2 వికెట్లను కోల్పోయిన ఆర్ఆర్, 80 పరుగులకు చేరుకున్న సమయంలోనే విజయం ఖరారైంది. ఆపై కోల్ కతా బౌలర్ వరుణ్ కొంత అడ్డుకున్నా, విజయాన్ని మాత్రం దూరం చేయలేకపోయాడు. సంజూకు జతకలిసిన డేవిడ్ మిల్లర్ జాగ్రత్తగా ఆడుతూ లక్ష్యాన్ని చేరారు.