Tamil Nadu: తమిళనాడు వ్యాప్తంగా నేడు సంపూర్ణ లాక్డౌన్
- తమిళనాడులో ఏడు నెలల తర్వాత లాక్డౌన్
- రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల మంది పోలీసుల మోహరింపు
- అత్యవసర సేవలకు మినహాయింపు
తమిళనాడు వ్యాప్తంగా నేడు సంపూర్ణ లాక్డౌన్ అమలవుతోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ లాక్డౌన్ కారణంగా ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల మంది పోలీసులు మోహరించారు. ప్రధాన రహదారుల నుంచి మార్కెట్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు సహా అన్ని చోట్లా పోలీసులు నిఘా పెంచారు.
కాగా, రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతుండడం ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి. గతేడాది సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు వివిధ ఆంక్షల నడుమ కార్యకలాపాలు సాగుతుండగా, నేడు పూర్తిగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయితే, ప్రసార మాధ్యమాలు, పాలు, మందులు తదితర అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. ఉదయం ప్రారంభమైన లాక్డౌన్ రాత్రి పది గంటల వరకు కొనసాగనుంది. అంబులెన్స్‌లు, రోగులను తరలించే వాహనాలకు మాత్రం లాక్డౌన్ నుంచి సడలింపు ఇచ్చారు.