Fire Accident: బాగ్దాద్ లో ఘోరప్రమాదం... ఆక్సిజన్ ట్యాంకర్ పేలి 82 మంది దుర్మరణం
- కొవిడ్ చికిత్సలో ఆక్సిజన్ కు పెరుగుతున్న డిమాండ్
- బాగ్దాద్ లోని ఖతీబ్ ఆసుపత్రిలో విషాద ఘటన
- ఒక్కసారిగా పేలిపోయిన ఆక్సిజన్ ట్యాంకర్
- పెద్ద సంఖ్యలో రోగుల మృతి
- 110 మందికి గాయాలు
- ఆసుపత్రి వద్ద హృదయ విదారక దృశ్యాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా కొనసాగుతున్న తరుణంలో ఆక్సిజన్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పలుచోట్ల ఆక్సిజన్ ట్యాంకర్లు పేలడం, అగ్నిప్రమాదాలు జరగడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఘోరప్రమాదం జరిగింది. ఇక్కడి దియాలా బ్రిడ్జి ప్రాంతంలో ఉన్న ఖతీబ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ పేలిన దుర్ఘటనలో 82 మంది మృత్యువాతపడ్డారు. 110 మంది గాయపడ్డారు.
ప్రమాదం సందర్భంగా ఖతీబ్ ఆసుపత్రి వద్ద దయనీయ దృశ్యాలు కనిపించాయి. తమవారిని కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చేసిన ప్రయత్నాలు కలచివేశాయి. ఆక్సిజన్ ట్యాంకర్ లీకవడంతో మంటలు శరవేగంతో వ్యాపించాయి. పలువురు కిటికీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.