Peddireddi Ramachandra Reddy: అధిక ధరలు వసూలు చేసే ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ నుంచి తొలగిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
- ఏపీలో కరోనా ఉద్ధృతి
- చికిత్స కోసం కరోనా రోగుల ప్రయాస
- తీవ్ర వ్యయభరితంగా మారిన కరోనా చికిత్స
- స్పందించిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి
- ఆసుపత్రుల్లో ధరలపై ప్రత్యేక జీవో
కరోనా రోగుల సంఖ్య నానాటికీ రెట్టింపవుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో వైద్యం అత్యంత ప్రయాసతో కూడిన వ్యవహారమవుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడిందన్న వార్తలు వస్తుండగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో బిల్లుల మోత మోగుతోందని కథనాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆసుపత్రుల్లో చార్జీలపై ప్రత్యేక జీవో తీసుకువచ్చామని, పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ కు రూ.2,500కు మించి వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. అధిక ధరలు వసూలు చేసే ఆసుపత్రులను సీజ్ చేయడమే కాకుండా, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి తప్పిస్తామని హెచ్చరించారు.