Liquid oxygen: పరిశ్రమల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ వినియోగంపై కేంద్రం నిషేధం!

Centre orders not to use Liquid Oxygen in Industries
  • మెడికల్ అవసరాలకు మాత్రమే వినియోగించాలని ఆదేశం
  • ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ
  • ఏ పరిశ్రమకు మినహాయింపు లేదని స్పష్టం
  • తక్షణమే అమల్లోకి ఆదేశాలు
  • దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలోనే నిర్ణయం
దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ వినియోగంపై నిషేధం విధించింది. తక్షణమే ఆక్సిజన్‌ వినియోగాన్ని నిలిపివేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. కేవలం వైద్య అవసరాల కోసం మాత్రమే ఆక్సిజన్‌ను అందించాలని స్పష్టం చేసింది. ఏ పరిశ్రమకు దీని నుంచి మినహాయింపు లేదని తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది.  

కరోనా కేసుల ఉద్ధృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టింది. ఇప్పటికే వివిధ పరిశ్రమల నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తిని ప్రారంభించి వైద్య అవసరాలకు వినియోగిస్తున్నారు. అయినా, కొన్ని పరిశ్రమలు ఇంకా ఉత్పత్తి కార్యకలాపాలకు ఆక్సిజన్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది.
Liquid oxygen
Medical oxygen
Home Ministry
Industries
Oxygen

More Telugu News