Tamilnadu: తమిళనాడు నుంచి ఏపీ, తెలంగాణకు ఆక్సిజన్... సరఫరా నిలిపివేయాలని ప్రధానికి సీఎం పళనిస్వామి లేఖ

Tamilnadu CM Palaniswami wrote PM Modi to stop Oxygen supply to AP and Telangana

  • తమిళనాడులో 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి
  • తెలుగు రాష్ట్రాలకు 80 మెట్రిక్ టన్నుల సరఫరా
  • తమిళనాడులో 310 మెట్రిక్ టన్నులు ఖర్చవుతోందన్న సీఎం
  • భవిష్యత్ లో మరింత పెరుగుతుందని వెల్లడి

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తుండడంతో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. వారిలో అత్యధికులకు ఆక్సిజన్ అవసరం కావడంతో దేశవ్యాప్తంగా ప్రాణవాయువు సరఫరాకు అత్యంత డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలకు పొరుగునే ఉన్న తమిళనాడు నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోంది. అయితే తమ అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలంటూ తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

తమిళనాడు నుంచి ఏపీ, తెలంగాణకు 80 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ తరలిస్తున్నారని, ఆ సరఫరా నిలిపివేయాలని పళనిస్వామి కోరారు. తమిళనాడులోనూ కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతోందని, ఇక్కడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీ పెరంబుదూరులో ఉత్పత్తి అయ్యే 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను తెలుగు రాష్ట్రాలకు తరలించడాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.

తమిళనాడులో ప్రస్తుతం 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందని, రాష్ట్రంలో వినియోగం 310 మెట్రిక్ టన్నులు అని పళనిస్వామి వివరించారు. కానీ కేంద్రం 220 మెట్రిక్ టన్నులే కేటాయించిందని తెలిపారు. కరోనా మరింతగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మున్ముందు ఆక్సిజన్ డిమాండ్ 450 మెట్రిక్ టన్నులకు చేరుతుందని పేర్కొన్నారు.

తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోందని, తమిళనాడు కంటే తక్కువ కేసులు వస్తున్న రాష్ట్రాలోని ఉక్కు పరిశ్రమల నుంచి తయారైన ఆక్సిజన్ ను ఆయా రాష్ట్రాలు వినియోగించుకునేలా చూడాలని సీఎం పళనిస్వామి సూచించారు.

  • Loading...

More Telugu News