Chandrababu: ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది: చంద్రబాబు
- ఆక్సిజన్ అందక కరోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు
- ఆక్సిజన్ కొరతను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైంది
- మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
ఏపీలో కరోనా అల్లకల్లోలం రేపుతుంటే వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని... ఆక్సిజన్ కొరతను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. ఆక్సిజన్ ను బ్లాక్ లో అమ్ముకుంటున్న కంపెనీలపై చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలని... ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఆక్సిజన్ అందక మృతి చెందడం కలచివేసిందని చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
జీవీఎంసీ 31వ వార్డు కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు.