David Hussy: ఇండియా నుంచి తిరిగి స్వదేశానికి చేరుకోగలమా అని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు: డేవిడ్ హస్సీ
- భారత్ నుంచి విమానరాకపోకలపై నిషేధం విధించిన పలు దేశాలు
- ప్రస్తుతం మేమంతా బబుల్ లో ఉంటున్నాం
- ఐపీఎల్ విజయవంతంగా ముగియాలని కోరుకుంటున్నాం
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. కరోనా ప్రభావం వల్ల ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ ను నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ లో వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు ఆడుతున్న సంగతి తెలిపిందే. మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ మెంటర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ హస్సీ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ లో కరోనా కేసులు కేసులు అమాంతం పెరిగిపోవడంతో.. పలు దేశాలు భారత్ నుంచి విమాన రాకపోకలపై నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో హస్సీ మాట్లాడుతూ, ఐపీఎల్ లో ఆడుతున్న ఆసిస్ క్రికెటర్లు ఒత్తిడికి గురవుతున్నారని... ఐపీఎల్ ముగిసిన తర్వాత తమ దేశానికి తిరిగి వెళ్లగలమా? అని ఆందోళన చెందుతున్నారని అన్నారు.
ప్రస్తుతం తామంతా బబుల్ లో ఉంటున్నామని హస్సీ తెలిపారు. ప్రతి రెండో రోజు తమకు కోవిడ్ టెస్టులను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆటగాళ్ల రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎంతో మంది కరోనా పేషెంట్లు ఆసుపత్రుల బెడ్లపై ఉన్నారనే వార్తలు ప్రతి క్షణం మీడియాలో చూస్తున్నామని చెప్పారు. నిన్న రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత తామంతా మాట్లాడుకున్నామని... ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అందరం అనుకున్నామని తెలిపారు.
టోర్నమెంట్ విజయవంతంగా ముందుకు సాగాలని ఆటగాళ్లంతా ఆకాంక్షించారని చెప్పారు. అయితే, టోర్నమెంట్ ముగిసిన తర్వాత స్వదేశానికి ఎలా వెళ్లాలనే దానిపైనే అందరూ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. కరోనా వల్ల ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్ల తండ్రులు కూడా చనిపోయారని చెప్పారు.