Supreme Court: ట్విట్టర్‌లో తన పేరిట నకిలీ ఖాతా సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ!
- అజిత్ దోవల్ వల్లే ముడిపదార్థాలపై నిషేధం ఎత్తివేత అని నకిలీ ఖాతాలో ట్వీట్
- ఇప్పటి వరకు మొత్తం 98 ట్వీట్లు
- చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
- ఇటీవలే సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన రమణ
గుర్తు తెలియని వ్యక్తులు ట్విట్టర్‌లో తన పేరిట నకిలీ ఖాతా సృష్టించి పోస్టులు పెడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతరాత్రి ఈ ఖాతాలో చేసిన ఓ పోస్టు వివాదాస్పదంగా ఉండడంతో ఆయన వెంటనే అప్రమత్తమై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ‘‘జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నెరిపిన దౌత్యంతోనే అమెరికా భారత్‌కు ముడిపదార్థాలు పంపాలని నిర్ణయించుకుంది’’ అంటూ పీఎంఓను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.
కొవిషీల్డ్ టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటి వరకు 98 సార్లు ఈ నకిలీ ఖాతా నుంచి వివిధ పోస్టులు పెట్టినట్లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. భారత 48వ సీజేఐగా ఆయన చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు.