AP High Court: ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్ పై ముగిసిన విచారణ... తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
- సంగం డెయిరీ వ్యవహారంలో ధూళిపాళ్ల అరెస్ట్
- హైకోర్టును ఆశ్రయించిన ధూళిపాళ్ల
- ధూళిపాళ్ల క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ
- వాదనలు వినిపించిన ధూళిపాళ్ల, ప్రభుత్వ న్యాయవాదులు
సంగం డెయిరీ వ్యవహారంలో తనను ఏసీబీ అరెస్ట్ చేయడంపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టగా... ధూళిపాళ్ల, ప్రభుత్వం తరఫున వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ లో ఉంచింది. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. అయితే ఆయన హయాంలో భారీగా అవకతవకలు జరిగాయంటూ కేసు నమోదు చేసిన ఏసీబీ అరెస్ట్ చేసింది. తనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం పట్ల ధూళిపాళ్ల హైకోర్టును ఆశ్రయించారు.
కాగా, ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమను ఆర్థికంగా కుంగదీసే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పాడిరైతులకు ఎంతో లబ్ది చేకూర్చుతున్న సంగం డెయిరీని దెబ్బతీసి అమూల్ కు మేలు చేసే చర్యలకు పాల్పడుతున్నారని, అన్యాయంగా సంగం డెయిరీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, టీడీపీ ఆరోపణలను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. సంగం డెయిరీ పేరుతో ధూళిపాళ్ల కోట్లాది రూపాయలు దోపిడీ చేశాడని ఆరోపిస్తున్నారు. రైతులకు చెల్లింపులు చేయకుండా అన్యాయం చేస్తున్నాడని, రైతులకు న్యాయం జరగాలంటే చర్యలు తప్పనిసరి అని వైసీపీ నేతలు అంటున్నారు.