Vishnu Kumar Raju: మరో మూడేళ్ల పాటు జగన్ సీఎంగా ఉంటారని అనిపించడం లేదు: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
- కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం విఫలమైంది
- భవనాల కూల్చివేతపై ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణపై లేదు
- విశాఖకు మందుల కొరత లేకుండా చూడాలి
ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మూడేళ్లపాటు జగన్ సీఎంగా ఉంటారని తనకు అనిపించడం లేదని ఆయన అన్నారు. కరోనా కట్టడి విషయంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని విధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చిన్నచిన్న షాపుల తొలగింపు, భవనాల కూల్చివేతలపై అధికారులకు ఉన్న శ్రద్ధ... కరోనా వైరస్ నియంత్రణపై లేదని మండిపడ్డారు.
ఆక్సిజన్, వ్యాక్సిన్, కోవిడ్ సెంటర్లు, రెమ్ డెసివిర్ వంటి వాటిపై దృష్టి సారించకుండా... రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించడం తుగ్లక్ చర్య అని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని... మందుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. కరోనా రోగులకు అవసరమైన మందులపై 3 నెలల పాటు జీఎస్టీ లేకుండా చూడాలని కోరారు.