Apple: భారత్ కు చేయూతగా నిలుస్తాం: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్
- భారత్ లో కరోనా విశ్వరూపం
- 3 లక్షలకు పైగా రోజువారీ కేసులు
- వేలల్లో మరణాలు
- బెడ్లు లేక, ఆక్సిజన్ దొరక్క రోగుల అవస్థలు
- చలించిన టెక్ దిగ్గజ కంపెనీలు
- క్షేత్రస్థాయి కార్యక్రమాలకు విరాళం ఇస్తామన్న ఆపిల్
నిత్యం 3 లక్షలకు పైగా కరోనా కేసులు, వేల సంఖ్యలో మరణాలతో తల్లడిల్లుతున్న భారత్ కు ప్రముఖ ఐటీ కంపెనీలు బాసటగా నిలిచేందుకు ముందుకు వస్తున్నాయి. గూగుల్ ఇప్పటికే రూ.135 కోట్ల విరాళం ప్రకటించగా, మైక్రోసాఫ్ట్ కూడా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు ఆర్థిక సాయం చేస్తామని పేర్కొంది. తాజాగా టెక్ జెయింట్ ఆపిల్ సంస్థ కూడా భారత్ కు చేయూతనిస్తామని వెల్లడించింది.
దేశంలో చేపడుతున్న కరోనా కట్టడి కార్యక్రమాలకు విరాళాలు అందిస్తామని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. భారత్ లో కరోనాతో పోరాడుతున్న అన్ని వర్గాల గురించి తాము ఆలోచిస్తున్నామని తెలిపారు. అయితే తాము ఎంత మొత్తంలో విరాళం ఇస్తామన్నది ఆపిల్ వెల్లడించలేదు. అయితే, క్షేత్రస్థాయిలో జరిగే కరోనా నివారణ కార్యకలాపాలకు తమ విరాళాలు అందజేస్తామని టిమ్ కుక్ పేర్కొన్నారు.