Chandrababu: కరోనాపై ప్రభుత్వానివన్నీ తప్పుడు లెక్కలే: చంద్రబాబు
- కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉందన్న చంద్రబాబు
- ప్రభుత్వ లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని వెల్లడి
- టెస్టుల సంఖ్య తగ్గించడం వల్లే కేసులు తగ్గుతున్నాయని స్పష్టీకరణ
- సర్కారు మీనమేషాలు లెక్కిస్తోందని మండిపాటు
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులకు, ప్రభుత్వం చెప్పే లెక్కలకు ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. కరోనాపై ప్రతి అంశంలోనూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. రోజువారీ కేసుల సంఖ్య 12 వేలకు చేరువైందని, టెస్టుల సంఖ్య తగ్గించడం వల్లే కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతోందని అన్నారు. అయినంత మాత్రాన కరోనా వ్యాప్తి చెందడమేమీ ఆగదని స్పష్టం చేశారు. ఇంట్లో శవాన్ని ఉంచి తలుపేస్తే, శవం కుళ్లిపోయి వాసన రాకుండా ఉంటుందా? అందరికీ తెలియకుండా ఉంటుందా? అని సర్కారు తీరుపై విమర్శలు చేశారు.
రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలు దాటిందని, 7 వేల మందికి పైగా చనిపోయినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని, క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ప్రజలు కరోనా మహమ్మారికి బలైపోతుంటే, ప్రభుత్వం తన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు విపక్షాలపై ఎదురుదాడి చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు తమ బాధలను స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితి కూడా లేదని, దీన్ని తాను ఖండిస్తున్నానని అన్నారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 25.8 శాతంగా ఉందని, దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో 10 లక్షల మందిలో 13,470 మందికి కరోనా నిర్ధారణ అవుతుంటే, ఏపీలో 10 లక్షల మందిలో 20 వేల మందికి కరోనా పాజిటివ్ అని వస్తోందని, ఏమిటీ వ్యత్యాసం? అని నిలదీశారు. దీన్నిబట్టి కరోనా కేసులను ప్రభుత్వం దాచిపెడుతోందన్న విషయం అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఇది మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని హెచ్చరించారు.
ఏపీలో ఆరోగ్యశ్రీ కరోనా రోగులకు వర్తింపజేయడంలేదని చంద్రబాబు ఆరోపించారు. కరోనా రోగుల చికిత్సలో మార్గదర్శకాలను ఎక్కడా పాటించడంలేదని, ఆక్సిజన్, రెమ్ డెసివిర్ అంశాల్లో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు. కరోనా అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఎక్కడైనా పనిచేస్తున్నాయా? అని సవాల్ విసురుతున్నట్టు చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించినప్పుడే విశ్వసనీయత ఏర్పడుతుందని హితవు పలికారు. గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టడమా మీ పాలన? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.