Asia Development Bank: ఈ ఏడాది భారీగా భారత్​ జీడీపీ: ఆసియా అభివృద్ధి బ్యాంకు

India GDP to grow at 11 percent in FY2021 Says ADB
  • 11% నమోదవుతుందని వెల్లడి
  • వ్యాక్సినేషన్ తో జీడీపీలో పురోగతి
  • 2022లో 7 శాతం కన్నా ఎక్కువే ఉంటుందని అంచనా
  • ఆసియా అభివృద్ధి విశ్లేషణ నివేదికలో వెల్లడి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 11 శాతం వృద్ధి నమోదవుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) వెల్లడించింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతుండడంతో వృద్ధి అంచనాలను భారత్ అందుకుంటుందని పేర్కొంది. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులతో ఆర్థిక పునరుత్తేజం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆసియా అభివృద్ధి విశ్లేషణ (ఏడీవో) 2021 నివేదికను ఈరోజు ఏడీబీ విడుదల చేసింది.

2022 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7 శాతం దాటుతుందని పేర్కొంది. అదే సమయంలో గతేడాది 6 శాతానికి పడిపోయిన దక్షిణాసియా జీడీపీ 9.5 శాతానికి పెరుగుతుందని తెలిపింది. 2022లో 6.6 శాతానికి చేరుతుందని పేర్కొంది. ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ జీడీపీ 7.3 శాతంగా నమోదవుతుందని వెల్లడించింది.

2022లో మళ్లీ 5.3 శాతానికి దిగివస్తుందని ఏడీబీ పేర్కొంది. హాంకాంగ్, చైనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగపూర్, తైపీ మినహా అభివృద్ధి చెందుతున్న ఆసియా ప్రాంతంలో జీడీపీ వృద్ధి 7.7 శాతంగా ఉంటుందని, వచ్చే ఏడాది 5.6 శాతం నమోదవుతుందని ఏడీబీ పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న ఆసియాలోని అన్ని దేశాలూ ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేస్తాయని వెల్లడించింది.

ఎగుమతులు, గృహ వినియోగం పెరగడంతో ఈ ఏడాది చైనా ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంటుందని ఏడీబీ స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం చైనా జీడీపీ 8.1గా.. వచ్చే ఏడాది 5.5గా ఉంటుందని తెలిపింది. తూర్పు ఆసియా జీడీపీ 7.4 శాతం పెరుగుతుందని పేర్కొంది.
Asia Development Bank
ADB
India
GDP
COVID19
Corona Vaccination

More Telugu News