Tirumala: నేటి నుంచి తిరుమల శ్రీవారికి ప్రకృతి సిద్ధ నైవేద్యం!
- రోజుకో రకంతో 365 రకాల బియ్యంతో నైవేద్యం
- రూపకల్పన చేసిన ప్రకృతి వ్యవసాయవేత్త ఎం.విజయరామ్
- ఆలయ అధికారులు, ప్రధాన అర్చకుల సమక్షంలో ప్రారంభం
తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యం నేటితో మారనుంది. ఇక నుంచి దేశీయ విత్తనాలతో ప్రకృతి సిద్దంగా సాగు చేసిన బియ్యంతో వండిన నైవేద్యాన్ని సమర్పించనున్నారు. రోజుకో రకంతో ఏడాదంతా 365 రకాల బియ్యంతో చేసిన ప్రసాదాన్ని స్వామివారికి నివేదించనున్నారు. నిజానికి మన దేశంలో ఆంగ్లేయుల పాలనకు ముందు ఇదే విధానం ఉండేది. ఆ తర్వాత ఇది కనుమరుగైంది.
ప్రస్తుతం నిత్యం మూడు పూటలా స్వామి వారికి 195 కిలోల ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరులోని సౌభాగ్య గోశాల, సేవ్ సంస్థ నిర్వాహకుడు, ప్రకృతి వ్యవసాయవేత్త ఎం.విజయరామ్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయగా, నేడు ఆలయ అధికారులు, ప్రధాన అర్చకుల సమక్షంలో ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే 15 రకాల ప్రకృతి సిద్ధ బియ్యంతో ఓ వాహనం తిరుమల చేరుకుంది.
ఇక శ్రీవారికి నైవేద్యంగా సమర్పించనున్న 15 రకాల ప్రకృతి సిద్ధ బియ్యంలో.. బహురూపి, నారాయణ కామిని, రత్నచోళి, కాలాబట్, చింతలూరు సన్నం, రాజ్‌బోగ్, రాజ్‌ముడి, చిట్టిముత్యాలు, బాస్‌బోగ్, తులసీబాసు, గోవింద్‌బోగ్, లాల్‌చోనా, ఎర్ర బంగారం, మాపిళ్లే, సాంబ రకాలు ఉన్నాయి.