Karnataka: కర్ణాటకలో అదృశ్యమైన 3 వేల మంది కరోనా రోగులు!
- వారి ఆచూకీ కోసం పోలీసుల సాయం
- మొబైల్ ఫోన్స్ స్విచ్చాఫ్ చేసుకున్న రోగులు
- వెంటనే బయటకు రావాలని కోరిన రెవెన్యూ మంత్రి
బెంగళూరు నగరంలో కరోనా సోకిన 3 వేల మందికి పైగా వ్యక్తులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్, వీరందరూ ఎక్కడ ఉన్నారు? ఎవరెవరిని కలుస్తున్నారన్న విషయాన్ని కనుక్కోవాలని పోలీసులను ఆదేశించామని అన్నారు. వీరంతా తమ మొబైల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకున్నారని, దీంతో వారి ఆచూకీ కనుక్కోవడం కష్టతరం అవుతోందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున కరోనా బాధితులకు కావాల్సిన ఔషధాలను ఉచితంగానే అందిస్తున్నామని, 90 శాతం కేసులను నియంత్రించగలుగుతున్నామని, అయితే, కరోనా తమకు సోకిందని తెలిసి కూడా బయట తిరుగుతూ ఉన్న వారితో సమస్య పెరుగుతోందని అన్నారు. ఇదే సమయంలో చాలా మంది వైరస్ సోకిన చాలా రోజుల తరువాత, పరిస్థితి విషమించిన దశలో ఆసుపత్రులకు వస్తున్నారని ఆయన అన్నారు.
"నేను వారికి చేతులు జోడించి ఒకటే చెప్పాలని భావిస్తున్నాను. వారి చర్యల కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోంది. చివరి సమయంలో ఐసీయూ బెడ్ల కోసం రావడం చాలా తప్పు. ఆ పని చేయనే చేయవద్దు. చాలా మంది తమ ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అదృశ్యమైన వారంతా ఇళ్లల్లో లేరు. వారెక్కడున్నారో తెలియడం లేదు. వెంటనే అందరూ వైద్యాధికారులను సంప్రదించాలి" అని అశోక్ వ్యాఖ్యానించారు.
ఇటీవలి కాలంలో కర్ణాటకలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కాంటాక్ట్ ట్రేసింగ్ పై అధికారులు శ్రద్ధ పెట్టారు. రాష్ట్ర పరిధిలో ఒక్కో కరోనా రోగి, కనీసం నలుగురికి వైరస్ ను అంటిస్తున్నాడని అధికారులు అంటున్నారు. బుధవారం నాడు రాష్ట్రంలో దాదాపు 39 వేల కేసులురాగా, 229 మంది కన్నుమూశారు.