Facebook: ‘రిజైన్​ మోడీ’ హాష్​ ట్యాగ్​ ను బ్లాక్​ చేసిన ఫేస్​ బుక్​.. పొరపాటున జరిగిందంటూ వివరణ

Facebook Temporarily Blocks Resign Modi Hashtag says Did it by Mistake
  • మూడు గంటల పాటు పోస్టుల స్తంభన
  • ప్రభుత్వ ప్రమేయమేమీ లేదని వెల్లడి
  • పోస్టులు తమ నిబంధనలకు లోబడి లేవని వివరణ
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు #ResignModi అంటూ హాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. అలాంటి హాష్ ట్యాగ్ లన్నింటినీ ఫేస్ బుక్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. దానిపై విమర్శలు రావడంతో ఫేస్ బుక్ స్పందించింది. పొరపాటున జరిగిందంటూ ప్రకటించింది. ఆ హాష్ ట్యాగ్ లతో కూడిన పోస్టులను బ్లాక్ చేయాలంటూ భారత ప్రభుత్వం తమనేమీ అడగలేదని స్పష్టం చేసింది.


కొన్ని పోస్టులు తమ కమ్యూనిటీ ప్రమాణాలకు లోబడి లేవని, అందుకే వాటిని బ్లాక్ చేశామని తెలిపింది. అయితే, కేవలం భారత్ లో మాత్రమే వాటిని నిషేధించింది. దాదాపు 3 గంటల పాటు ఆ పోస్టులను బ్లాక్ చేసింది. ఆ తర్వాత పోస్టులను పునరుద్ధరించింది. అయితే, బ్లాక్ చేసిన ఆ కొద్ది సేపూ విదేశాల్లో ఆ పోస్టులు యథావిధిగా కనిపించాయి.

కాగా, అంతకుముందు ట్విట్టర్ కూడా పలువురి ట్వీట్లను తొలగించిన సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ కొందరు విమర్శిస్తున్నారు. తీవ్రమైన ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత వంటి వాటి నేపథ్యంలోనే వారు ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలంటూ హాష్ ట్యాగ్ ద్వారా డిమాండ్ చేస్తున్నారు.
Facebook
Resign Modi
COVID19

More Telugu News